: రూ. 75 వేల కోట్లు చాలవా? లగడపాటికి వ్యతిరేకంగా విజయవాడలో ప్లెక్సీల కలకలం!
మాజీ ఎంపీ, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి రాజగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలంటూ విజయవాడలో ప్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని ప్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది. గతంలో రాజకీయాల్లో ఆయన అక్రమంగా రూ. 75 వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, ఇప్పుడు మరలా రాజకీయాల్లోకి వచ్చి మరింత దోచుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నిస్తూ, కొందరు ప్లెక్సీలను కట్టారు. "75 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని, బ్యాంకులను ముంచి, కుటుంబం పేరు మీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడ పెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ... మీ అభిమానులు" అని వ్యంగ్యంగా రాసివుంది. మధ్యలో "చాలవు... ఇంకా కావాలి" అన్న స్లోగన్ కూడా ఉంది. వీటిని చూసిన లగడపాటి అభిమానులు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ నేతకు వ్యతిరేకంగా ఉన్న ప్లెక్సీలను లగడపాటి అనుచరులు చించివేశారు. పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.