: విశాఖపై మనసు పారేసుకున్న కెప్టెన్ కూల్ ధోనీ
నవ్యాంధ్ర ఎకనమికల్ కేపిటల్, సాగర నగరం విశాఖ... అందరి మనసునూ దోచేస్తోంది. స్వచ్చ భారత్ అభియాన్ లో భాగంగా క్లీనెస్ట్ సిటీల జాబితాలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ నగరం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఆకట్టుకుంది. మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కోసం విశాఖ వచ్చిన ధోనీ... అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వైజాగ్‌నుంచి తిరిగి వెళుతున్నా. నేను నివసించడానికి ఇష్టపడే నగరాల్లో ఇదొకటి. బీచ్‌తో పాటు అందమైన, ఆకట్టుకునే పచ్చదనం విశాఖ సొంతం. నా మొదటి భారీ ఇన్నింగ్స్‌కు వేదిక కూడా విశాఖే' అని ధోనీ ట్వీటాడు. 2005 ఏప్రిల్ 5న పాకిస్థాన్ తో విశాఖలో జరిగిన మ్యాచ్ లో 148 పరుగులు చేసిన ధోనీ తొలి సెంచరీని ఇక్కడే నమోదు చేశాడు. ఆ సెంచరీతోనే ధోనీ ‘హెలికాప్టర్ షాట్’ పవర్ క్రికెట్ ప్రపంచానికి తెలిసి వచ్చింది.