: ఇక ఏపీలో ‘ఆకర్ష్’ వల!... చేరికలకు టీడీపీ గేట్లు ఎత్తేస్తోందట!


నిన్నటిదాకా తెలంగాణలో ‘ఆకర్ష్’ మంత్రంతో అధికార టీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఈ మంత్రానికి కుదేలైపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి మినహా ఆ పార్టీకి పెద్దగా స్వరమున్న నేత అంటూ లేని పరిస్థితి తయారైంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మందిని లాగేసిన టీఆర్ఎస్... మరో ఇద్దరిని చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. దీనిపై నిన్నటి కేబినెట్ భేటీలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ తరహాలోనే ఏపీలోనూ ‘ఆకర్ష్’ మంత్రానికి తెర తీద్దామంటూ పలువురు మంత్రులు చేసిన ప్రతిపాదనకు ఆయన సరేనన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికిప్పుడు పార్టీలోకి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 10 మంది ‘సైకిల్’ ఎక్కడం ఖాయమని ఆయన ముందు మంత్రులు లిస్ట్ పెట్టారట. అయితే పనికొచ్చే వారికి మాత్రమే పచ్చజెండా ఊపాలన్న చంద్రబాబు, అదే సమయంలో స్థానికంగా ఉన్న పార్టీ నేతలతో సమస్యలు రాకుండా జాగ్రత్తలు వహించాలని మంత్రులకు సూచించారట. ఈ మేరకు ఏపీలో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరహా చేరికలకు తెర లేస్తే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన సొంత జిల్లా కడప నుంచే షాక్ తగిలే అవకాశాలున్నట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం సాగింది. అయితే జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జీ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అడ్డు చెప్పడంతో ఈ చేరిక నిలిచిపోయింది. తాజాగా నిన్న రామసుబ్బారెడ్డితోనే మాట్లాడిన చంద్రబాబు... ఆది చేరికకు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. ఆది చేరికతోనే ‘ఆకర్ష్’కు తెర తీయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News