: ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీ అరెస్ట్... దేశద్రోహం కేసు నమోదు
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో చెలరేగిన కల్లోలం మరింత విస్తరించేలానే ఉంది. భారత పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరి తీతను నిరసిస్తూ ఓ గ్రూపు ర్యాలీ తీయడం, ఏబీవీపీ విద్యార్థులు దానిని అడ్డుకున్న నేపథ్యంలో రాజుకున్న చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు నేటి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీని (పార్లమెంటుపై దాడి కేసులో ఇతనికి కూడా కోర్టు ఉరిశిక్ష విధించినా, అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఈయనను నిరపరాధిగా విడుదల చేసింది) అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసిన కేసులో గిలానీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నడిరేయి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్న గిలానీపై రాజద్రోహం కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వైద్య పరీక్షల కోసం ఆయనను ఆసుపత్రికి తరలించిన పోలీసులు క్షణాల్లో ఎఫ్ఐఆర్ రాసేశారు. ఈ విషయంపై నేడు మరింత వివాదం రేగే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.