: ఖమ్మం నగరానికి మరో మూడు వేల ఇళ్లు: కేసీఆర్ హామీ
ఖమ్మం నగరానికి ఇప్పటికే రెండు వేల ఇళ్లు కేటాయించామని, మరో మూడు వేల ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈరోజు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో నివసిస్తున్న పేదప్రజల సంఖ్య ఎక్కువగా ఉందని, వారి కోసం మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని, 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేందుకు ఐదు కిలోమీటర్ల లోపే స్థలం ఉందని చెప్పారు. కనీసం 50 వేల మందికి ఒక మార్కెట్ ఉండాలని, అయితే ఆ పరిస్థితి ఖమ్మంలో లేదని అన్నారు. అంతేకాకుండా, డంపింగ్ యార్డులు కూడా ఉండాల్సిన సంఖ్యలో లేవన్నారు. ఖమ్మంలో అధునాతన బస్టాండ్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.