: ఏడంతస్తుల మేడ ఇది... అతని 'ఆశా'సౌధమిది!
రక్తసంబంధాలు మృగ్యమైపోతున్న ప్రస్తుత తరుణంలో... ఎప్పుడో గతించిన తన సోదరుల కోసం ఓ వ్యక్తి ఏడంతస్తుల మేడ కట్టాడు. చైనాలోని షడాంగ్ లో సమీపంలోని లిన్ కూ ప్రాంతంలో హుగాంగ్ జౌ (54) అనే వ్యక్తి తన సోదరుల కోసమని ఈ మేడకట్టాడు. కేవలం మట్టి, రాళ్లు, కర్రలు, పాత ఇనుప రేకులతో, కూలీల సాయం లేకుండా దీనిని అతనొక్కడే కష్టపడి కట్టడం విశేషం. ఈ మేడ కట్టేందుకు అతనికి పదేళ్లు పట్టింది. అయితే అతని ఆరుగురు సోదరులు ఎప్పుడో మరణించారని స్థానిక మీడియా చెబుతోంది. అయితే అతను మాత్రం వారు చనిపోలేదని, ఏదో ఒకరోజున వారంతా తిరిగి వస్తారని గుడ్డిగా నమ్ముతున్నాడు. వారికోసమే ఈ ఇల్లు నిర్మించానని చెబుతున్నాడు. అయితే అతను మానసిక వ్యాధితో భాధపడుతున్నాడని, అందుకే ఈ పనిలో నిమగ్నమై, దానిని పూర్తి చేయగలిగాడని, మధ్యలో అడ్డుపడితే ఎలా స్పందిస్తాడో అని సంశయించి, ప్రభుత్వాధికారులు కూడా ఏమీ అనలేదని స్థానికులు చెబుతున్నారు. చూసేందుకు ఎబ్బెట్టుగా కనిపించే ఆ ఇంటిని చూసేందుకు పర్యాటకులు మాత్రం క్యూకడుతూ, అతని నమ్మకానికి ఆశ్చర్యపోతున్నారు.