: ఆ డ్యాం బద్దలైతే 5 లక్షల మంది జల సమాధే!: అమెరికా హెచ్చరిక


ఇరాక్ లోని టైగ్రిస్ నదిపై నిర్మించిన మోసూల్ డ్యాంకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా సైన్యానికి చెందిన ఇంజనీర్ల బృందం హెచ్చరించింది. ఎగువ నుంచి వస్తున్న నీటి ఒత్తిడిని తట్టుకోలేక డ్యాం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే జరిగితే సుమారు 5 లక్షల మంది ప్రజలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ డ్యాం బద్దలైతే 180 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం దూసుకువస్తుందని, దీని ధాటికి 280 మైళ్ల దూరంలో ఉన్న బాగ్దాద్ కూడా నీటమునుగుతుందని వారు హెచ్చరించారు. ఈ డ్యాం బద్దలైతే దానికి 30 మైళ్ల దూరంలో ఉన్న మోసూల్ పట్టణం కేవలం నాలుగు గంటల్లోనే 65 అడుగుల నీటిలో మునిగిపోతుందని, ఆ తరువాత తీక్రిత్ నగరం 50 అడుగుల లోతులో నీట మునుగుతుందని, అంతటితో ఆగని వరద నీరు బాగ్దాద్ ను కూడా 13 అడుగుల వరకు ముంచుతుందని వారు తెలిపారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్యాం ఇదేనని దశాబ్దం క్రితమే నిపుణులు అంచనా వేసిన సంగతిని వారు గుర్తు చేశారు. బంకమట్టి, సున్నపురాయి లాంటి జిప్సం ఖనిజంపై ఈ డ్యాంను నిర్మించడంతో ఈ ముప్పు ఉందని అమెరికా ఇంజనీర్ల బృందం పేర్కొంది. గతంలో దీనికి మరమ్మతులు జరిగాయని, ఐసిస్ దళాలు మోసూల్ పట్టణాన్ని ఆక్రమించుకోవడంతో దాని మరమ్మతు పనులు ఆగిపోయాయని అమెరికా సైన్యానికి చెందిన ఇంజనీర్ల బృందం ఇరాక్ ప్రభుత్వానికి గత నెల నివేదిక సమర్పించింది. తాజాగా ఈ నివేదికను ఇరాక్ ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. దీంతో ఇది వెలుగుచూసింది. 2014లో ఐసిస్ దళాలు మోసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ పని చేసే జలవిద్యుత్ కేంద్రాన్ని మూసేసింది. దీంతో డ్యాంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు డ్యాం మరమ్మతులను పునఃప్రారంభించేందుకు మోసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక వేళ మోసూల్ పట్టణాన్ని ఉగ్రవాదులు కోల్పోతే డ్యాంకు ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని ఇరాక్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా నివేదికను ఇరాక్ జలవనరుల మంత్రి పరిగణనలోనికి తీసుకోవడం లేదు. మరింత సైన్యాన్ని ఇరాక్ కు పంపేందుకు అమెరికా ఇలాంటి నివేదిక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మాత్రం దీనిని విశ్వసించడమే కాకుండా, అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఈ డ్యాం మరమ్మతు పనులు ఇటలీకి చెందిన టెవ్రీ కంపెనీకి 1900 కోట్ల రూపాయలకు అప్పగించారు.

  • Loading...

More Telugu News