: 2 శాతం పెరిగిన మార్కెట్, రూ. 500 తగ్గిన బంగారం, రూ. 1000 పడిపోయిన వెండి ధర!
కనిష్ఠ స్థాయుల వద్ద లభించిన కొనుగోలు మద్దతు భారత స్టాక్ మార్కెట్ ను 2 శాతానికిపైగా లాభాల్లోకి నడిపించగా, బులియన్ మార్కెట్ కుదేలైంది. ఈ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 441 తగ్గి రూ. 28,945 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు ఒకదశలో బంగారం ధర రూ. 500 కన్నా ఎక్కువే పతనమైంది. మరోవైపు వెండి ధర కిలోకు ఒకదశలో రూ. 1000కి పైగా పతనమై, ఆపై కొద్దిగా కోలుకుని క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 917 తగ్గి రూ. 37,067కు చేరింది. ఇదిలావుండగా, బీఎస్ఈ సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 2.33 శాతం లాభంతో 23,521 పాయింట్లకు, నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 2.50 శాతం లాభంతో 7,155.35 పాయింట్లకు పెరిగాయి. నిఫ్టీ 50లో 47 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.