: ఖమ్మంలో ఖాళీ అవుతున్న టీడీపీ!... గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్సీ పోట్ల


ఖమ్మం జిల్లా... ఆదిలో కమ్యూనిస్టులకు పెట్టని కోట. సినీ వినీలాకాశంలో తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా నీరాజనాలందుకుని, ఆ తర్వాత రాజకీయ తెరంగేట్రం చేసిన దివంగత నందమూరి తారకరామారావు... తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించే దాకానే ఈ పరిస్థితి. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లాను టీడీపీకి పెట్టని కోటగా మార్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కిందకు వచ్చేసిన ఆ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తుమ్మల ఓటమిపాలయ్యారు. తదనంతర పరిణామాల్లో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన వెన్నంటే పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇక ఆ జిల్లాలో టీడీపీకి నామా నాగేశ్వరరావు మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ లేరు. ప్రస్తుతం నామా కూడా అంత యాక్టివ్ గా లేరు. ఇక ఆ పార్టీకి అంతో ఇంతో నేతలున్నారని చెప్పుకునే పరిస్థితి కూడా ఆ జిల్లాలో లేదనే చెప్పాలి. ఎందుకంటే గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన పోట్ల నాగేశ్వరరావు తాజాగా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పోట్ల... తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. నేడు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు కూడా అక్కడే ఉండనున్నారు. రేపు ఖమ్మంలో జరిగే ఓ కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో పోట్ల గులాబీ కండువా కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News