: వల్లభనేని ఆందోళనకు జగన్ మద్దతు!... రామవరప్పాడు పేదల తరఫున కోర్టుకెళతామని ప్రకటన
టీడీపీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నిన్న చేపట్టిన ఆందోళనకు విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలికారు. నిన్న గన్నవరం నియోజకవర్గ పరిధిలోని రామవరప్పాడులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ పేదల పూరి గుడిసెలను తొలగించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు యత్నించారు. ఈ క్రమంలో అధికారులను పేదలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పేదలకు అండగా నిలిచారు. బాధితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న ఆయన సీఎం నారా చంద్రబాబునాయుడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతేకాక బాధితులతో కలిసి అక్కడే జాతీయ రహదారిపై ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీనిపై పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేయగా, నేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం విజయవాడ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రామవరప్పాడు బాధితులను పరామర్శించారు. బాధితుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన వారి తరఫున కోర్టుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వెరసి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని ఆధ్వర్యంలో జరిగిన నిన్నటి ఆందోళనకు వైఎస్ జగన్ మద్దతిచ్చినట్టైంది.