: ‘అగ్రిగోల్డ్’ మాయగాళ్లకు బెయిలా? కస్టడీనా?... మరికాసేపట్లో తేల్చనున్న ఏలూరు కోర్టు
నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ మాయగాళ్లకు బెయిలా? పోలీసు కస్టడీనా? అన్న విషయం మరికాసేపట్లో తేలనుంది. అధిక వడ్డీల ఆశ చూపి అమాయక జనం నుంచి వేలాది కోట్ల రూపాయలను లాగేసిన అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణరావులు నయా మోసానికి పాల్పడ్డారు. కేసు దర్యాప్తు నత్తనడక నడుస్తున్న తీరుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, మొన్న ఏపీ సీఐడీ అధికారులు చైర్మన్, ఎండీలను అరెస్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు వారిని ఏలూరు కోర్టుకు తరలించింది. తాజాగా కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులిద్దరినీ 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక నిందితులిద్దరికీ బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాది మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టు విచారణ చేపట్టనుంది.