: రైలు టికెట్ల ధర పెంపు లేదు!...ప్రత్యామ్నాయ ఆదాయంపైనే సురేశ్ ప్రభు దృష్టి
ఈ నెల 25న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. రైల్వే బడ్జెట్ వస్తోందంటేనే, రైలు టికెట్ల ధరలు పెరగడం ఖాయమేనన్న భావన ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ వాదనలకు భిన్నంగా ఈ దఫా సురేశ్ ప్రభు రైలు టికెట్ల ధరల పెంపు జోలికి వెళ్లడం లేదట. గతేడాది వ్యవహరించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై భారం మోపేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ఎందుకంటే, టికెట్ ధరలను 10 శాతం పెంచినా, రైల్వేలకు ఏటా సమకూరేది కేవలం రూ.4,500 కోట్లేనట. దీంతో టికెట్ ధరల పెంపు కంటే ప్రత్యామ్నాయ వనరుల ద్వారానే ఆదాయం పెంచుకోవాలని ఆయన తలపోస్తున్నారు. టికెట్ ధరల పెంపునకు అటు ప్రధాన మంత్రి కార్యాలయం కూడా సుముఖంగా లేదట. దీంతో టికెట్ ధరల పెంపు విషయాన్ని పక్కనబెట్టేసిన ప్రభు... ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇక బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కన్నా, ఇప్పటిదాకా ప్రకటించిన రైల్వే నెట్ వర్క్ ను పెంచుకోవడానికే ప్రభు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.