: వారందరినీ కాల్చండి, చంపిపారేయండి: జేఎన్యూ ఘటనలపై బీజేపీ ఎంపీ
నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ నేత, 'ఉన్నావో' ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి అదే దారిలో నడిచారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, దేశానికి ద్రోహం చేస్తున్న వారిని కాల్చి చంపాలని వ్యాఖ్యానించారు. "జేఎన్యూ ఘటనలను ప్రతిఒక్కరూ ఖండించాలి. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని పార్టీలు తుచ్చ రాజకీయాలు చేస్తున్నాయి. వీరంతా ద్రోహులు, జాతి వ్యతిరేకులు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అన్నారు. దేశానికే ద్రోహం చేస్తున్న వారెవరినైనా సరే పోలీసులతో కాల్చి చంపించాలి. ఈ తరహా ద్రోహులకు యావజ్జీవ శిక్ష విధించినా, అది తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు. సాక్షి మహరాజ్ మాట్లాడిన ఈ వ్యాఖ్యల వీడియోను ఏబీపీ న్యూస్ ప్రసారం చేసింది.