: సొంత పార్టీ సర్కారుపై వల్లభనేని అసంతృప్తి... గన్ మెన్లను తిప్పిపంపిన వైనం
టీడీపీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే కారాలు మిరియాలు నూరుతున్నారు. నిన్న తన నియోజకవర్గ పరిధిలోని రామవరప్పాడులో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపునకు యత్నించిన మునిసిపల్ అధికారులను ఆయన అడ్డుకున్నారు. అంతేకాక నోటీసులు ఇవ్వకుండా గుడిసెల తొలగింపునకు వచ్చిన అధికారుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై పేదలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామైంది. దీనిపై ఉన్నతాధికారులకు వివరాలు చెప్పిన పటమట పోలీసులు వల్లభనేనిపై కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న వల్లభనేని ఆగ్రహానికి గురయ్యారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా, తనపై కేసు నమోదైన వైనానికి నిరసనగా ఆయన తనకు కేటాయించిన గన్ మెన్లను తిప్పి పంపారు. నిన్ననే డీజీపీ జేవీ రాముడికి ఈ మేరకు లేఖ రాసిన ఆయన, డీజీపీ నుంచి సందేశం రాకుండానే తన గన్ మెన్లను తిప్పి పంపినట్లు సమాచారం. ఇక నేటి ఉదయం అనుచరులతో కలిసి పోలీసులకు సరెండర్ అయ్యేందుకు ఆయన సిద్ధమయ్యారు.