: హరీశ్ రావుకు కూడా ప్రమోషన్?
నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయమని వివిధ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన తరుణంలో, ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావుకు మరో ముఖ్య శాఖ కూడా అప్పగించవచ్చని తెలుస్తోంది. ఖేడ్ ఫలితాలు రాగానే హరీశ్ కు సమాచార, పౌర సంబంధాల శాఖను అప్పగించవచ్చని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో విజయం తరువాత, ప్రచార సారధ్య బాధ్యతలు వహించిన కేటీఆర్ కు కీలకమైన మునిసిపల్ శాఖను అందించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులను సమానంగా చూడాలంటే, ఆయనకూ మరో శాఖను అప్పగించాలని కొందరు పార్టీ నేతలు కేసీఆర్ దగ్గర తమ అభిప్రాయాలను వెల్లడించగా, తన వద్ద ఉన్న శాఖలను పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో హరీశ్ రావుకు కూడా ప్రమోషన్ దక్కుతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.