: ఫేస్ బుక్ ను వీడిన తొలి ఉద్యోగిని కీర్తికా రెడ్డి!
ఆమె పేరు కీర్తికా రెడ్డి. జూలై 2010లో ఫేస్ బుక్ సంస్థకు తొలి భారత ఉద్యోగిగా చేరారు. ప్రస్తుతం ఫేస్ బుక్ భారత ఎండీగా ఉన్న ఆమె సంస్థలో ఇక పనిచేయబోనని చెబుతూ రాజీనామా చేశారు. సంస్థ ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఫ్రీ బేసిక్స్ విషయంలో అభాసుపాలు కావడం, ఆపై సంస్థ వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహావేశాలకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా రంగంలోకి దిగగా, అదే సమయంలో కీర్తికా రెడ్డి రాజీనామా సంస్థలో ఒకింత కలకలాన్ని రేపింది. కాగా, ఇండియాలో అత్యధిక యూజర్ బేస్ ఉన్నప్పటికీ, ఫేస్ బుక్ ను వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దాన్ని లాభాలుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నందునే ఆమె తన పదవికీ రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాన్ ఫోర్డ్ నుంచి మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ గా ఇండియాకు తిరిగొచ్చిన ఆమె, ఫేస్ బుక్ హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు ఆరేళ్ల క్రితం పని చేశారు. మూడేళ్ల క్రితం వరకూ కంపెనీ ఆన్ లైన్ ఆపరేషన్స్ డైరెక్టరుగా ఉన్న ఆమె, ప్రస్తుతం సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె చేరిన సమయంలో 80 లక్షలుగా ఉన్న ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య ఇప్పుడు 13.8 కోట్లకు చేరింది. యూఎస్ తరువాత ఫేస్ బుక్ కు రెండవ అతిపెద్ద మార్కెట్ గా ఇండియా మారిందంటే, దాని వెనుక కీర్తిక కృషి ఎంతైనా ఉంది. ఇక ఆమె రాజీనామా సంస్థకు ఇబ్బందికరమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. తన తరువాత ఎండీగా ఎవరిని ఉంచాలన్న విషయమై ఆసియా పసిఫిక్ ఎండీ విలియన్ ఈస్టన్, వైస్ ప్రెసిడెంట్ డాన్ నెర్రీలతో తాను చర్చించినట్టు కీర్తిక వెల్లడించారు.