: డబ్బుందా?... ఉంచుకోండి, పెట్టుబడులు మాత్రం వద్దంటున్న నిపుణులు


సంపద పెరగాలంటే, చేతిలో ఉన్న డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలి. అది స్టాక్ మార్కెట్ అయినా, బులియన్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ సెక్టారయినా, బ్యాంకుల్లో డిపాజిట్ గానైనా... పెట్టిన పెట్టుబడికి దీర్ఘకాలంలో రాబడులు కోరుకునేవారు ఎవరైనా చేయాల్సిందిదే. అయితే, మీ దగ్గర డబ్బుంటే ఇప్పటికిప్పుడు మాత్రం ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దని, కొంత కాలం వేచి చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లను ఆశ్రయించాలని భావించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గత కొంతకాలంగా పతనమవుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లోని కొన్ని కంపెనీల ఈక్విటీలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పతనానికి ముగింపు ఇదేనని భావించలేమని మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లకు ఎంతమాత్రమూ అనుకూలంకాని రంగాల్లో బ్యాంకింగ్ సెక్టారు ఒకటని ఆయన అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్న వేళ, ఇండియా సైతం అదే దారిలో నడవక తప్పదని, ఇది 2008 నాటి మాద్యం పునరావృతమని వరల్డ్ స్టాక్ నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. చైనా కరెన్సీ, యూరోపియన్ బ్యాంకింగ్ కష్టాలు మరింత నష్టాలకు కారణం కావచ్చని అన్నారు. భారత్ లో కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహంగా ఉన్నాయని, ప్రభుత్వం సైతం ముందుకు సాగడంలో విఫలమవుతోందని వెల్లడించిన ఆయన, స్టాక్ మార్కెట్లలో మరింత అమ్మకాలు నమోదు కావచ్చని హెచ్చరించారు. తాత్కాలిక లాభాలను చూసి అడుగువేయవద్దని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News