: 181 ఎంజీ స్థాయిలో మందుకొట్టి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్!
అది పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. ఏపీ 29 జడ్ 1319 నంబరుగల ఆ బస్సు జేబీఎస్ నుంచి శ్రీశైలం బయలుదేరింది. దాన్ని నడుపుతున్న కే అఫ్సర్ అనే డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని కొందరు ప్రయాణికులకు అనుమానం వచ్చింది. బస్సు మలక్ పేట సమీపంలో ఉండగా ఓ ప్రయాణికుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆపై పావుగంటకే ఆజంపుర చౌరస్తా వద్ద బస్సును పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపారు. డ్రైవర్ రక్తంలో 181 బీఏసీ స్థాయి ఉన్నట్టు తేలింది. అంటే దాదాపు ఆరు పెగ్గులకు పైగా అతను మద్యం సేవించి ఉన్నట్టు! డ్రైవర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆ స్థాయి మద్యం సేవించి బస్సు నడిపితే, అందరి ప్రాణాలూ ప్రమాదంలో ఉన్నట్టేనని పోలీసులు తెలిపారు.