: మార్చి 26న ఆఖరి సంచిక: ఇక మూతేనన్న 'ది ఇండిపెండెంట్'
1980లో ప్రారంభమై, ఓ దశలో నాలుగు లక్షలకు పైగా సర్క్యులేషన్ ను అనుభవించిన బ్రిటన్ దినపత్రిక 'ది ఇండిపెండెంట్' ఇక మూతబడనుంది. పత్రికలు కొనేవారు కరవవడం, సర్క్యులేషన్ 40 వేలకు దిగజారడంతో నిర్వహణావ్యయాలు భరించలేకనే పత్రికను మూసేస్తున్నట్టు ది ఇండిపెండెంట్ యజమాని ఇవ్ జనీ వెబిదేవ్ వెల్లడించారు. ప్రింట్ విభాగంలో మార్చి 26న ఆఖరి ఎడిషన్ వస్తుందని, ఇండిపెండెంట్ కు అనుబంధంగా ఉన్న 'ఇండిపెండెంట్ ఆన్ సండే' పత్రిక మార్చి 20తో ముగుస్తుందని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో మాత్రం పత్రిక కొనసాగుతుందని, మరింత సమర్థవంతంగా నెటిజన్లకు పత్రికను దగ్గర చేస్తామని ఆయన తెలిపారు. కాగా, యువతను టార్గెట్ చేస్తూ, లెబెదేవ్ అక్టోబర్ 2010లో ప్రారంభించిన 'ఐ' పత్రిక అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గినప్పటికీ, దీన్ని మాత్రం కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.