: మన్మోహన్ సింగ్ పై విరుచుకుపడ్డ అరుణ్ జైట్లీ!


గతంలో ఇండియాను పాలించిన యూపీఏ హయాంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ఎన్డీయే హయాంలో ప్రపంచవ్యాప్తంగా 'బ్రాండ్ ఇండియా' గుర్తింపు లభించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. మోదీ సర్కారుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించగా, వాటిని జైట్లీ తీవ్రంగా ఆక్షేపించారు. "ప్రస్తుత ప్రభుత్వం పనితీరును మన్మోహన్ సింగ్ తప్పకుండా విశ్లేషించి ఉంటారు. సహజవనరుల కేటాయింపు పారదర్శక విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా పంచుతూ ఉండటాన్ని ఆయన గమనించే ఉంటారు. పారిశ్రామికవేత్తలు అనుమతుల కోసం నార్త్ బ్లాక్ కు రానక్కర్లేదన్న సంగతి ఆయనకు తెలిసే ఉంటుంది. పర్యావరణ అనుమతులు సైతం ఎక్కడా ఆలస్యం కావడం లేదని కూడా ఆయనకు తెలుసు. గతంలోలా పరిస్థితులు లేవన్న విషయం ఆయనకు అర్థమయ్యే ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. భారత ఎకానమీకి మేలు కలిగేలా మోదీ నిర్ణయాలు తీసుకోవట్లేదంటూ 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై విమర్శలు మాని, నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆయనకు మంచిదని జైట్లీ సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News