: పాక్ కు యుద్ధ విమానాలు ఇవ్వాలని ఒబామా నిర్ణయం... ఆగ్రహించిన భారత్
అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ కు విక్రయించాలని ఒబామా సర్కారు తీసుకున్న నిర్ణయంపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అణ్వస్త్రాలను సైతం తీసుకెళ్లగల ఈ యుద్ధ విమానాల డీల్ చాలాకాలంగా పెండింగ్ లో ఉండగా, ఇప్పుడు దీనిపై నిర్ణయం వెలువడింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ సభ్యుల్లో చాలా మంది ఈ డీల్ ను వ్యతిరేకించినప్పటికీ, బ్లాక్ 52 క్లాస్ కు చెందిన ఎఫ్-16లతో పాటు వాటి మరమ్మతు పరికరాలు, శిక్షణ, ఉపయోగించే విధానం తదితరాలను అందించనున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్ కు తెలిపింది. ఈ డీల్ విలువ 69.94 కోట్ల డాలర్లని వివరించింది. కాగా, ఈ డీల్ కూడదని సెనెటర్ మట్ సాల్మన్ ఇటీవల విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇండియాతో యుద్ధం జరిగితే పాక్ వీటిని వాడే ప్రమాదముందని, ఎఫ్-16లు పాక్ కు చేరితే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన హెచ్చరించారు కూడా. కాగా, పాక్ కు యుద్ధ విమానాలు ఇవ్వాలని యూఎస్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను పిలిపించిన విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్, భారత ఆక్షేపణను తెలియజేశారు.