: టైటిల్ పోరులో రాహుల్ సేన సత్తా చాటుతుందా?
అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ పోరులో రాహుల్ ద్రవిడ్ సేన సత్తా చాటుతుందా? విండీస్ ను కట్టడి చేసి వరల్డ్ కప్ ను సగర్వంగా ఎత్తుకుంటుందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు విశ్లేషకులు. రేపు ఉదయం 9 గంటలకు డాకాలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సత్తా చాటేందుకు రెండు జట్లు సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలాబలాలను అంచనా వేస్తే, భారత జట్టే హాట్ ఫేవరేట్ గా నిలుస్తుంది. ఇంత వరకు టీమిండియా ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా దూసుకువచ్చింది. ఇక విండీస్ జట్టు బౌలింగ్ ఆయుధంగా బరిలో దిగుతోంది. ప్రత్యర్థుల టాప్ ఆర్డర్ పై విండీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీంతో ఈ జట్టు గెలిచిన మ్యాచుల్లో బౌలింగ్ ప్రధాన భూమిక పోషించింది. టీమిండియా విషయానికి వస్తే...బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆయుధాలుగా ఫైనల్ కు దూసుకువచ్చింది. ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు ఎవరి బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అండర్ 19 కెప్టెన్ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఆరంభంలో అదరగొడుతున్నారు. రిషబ్ పంత్ తన బ్యాట్ కు తిరుగులేదని చెబుతున్నాడు. అనంతరం సర్ఫ్ రాజ్ ఖాన్, అన్ మోల్ ప్రీత్ ఆకట్టుకుంటున్నారు. సర్ఫ్ రాజ్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు విఫలమైన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. వీరు బ్యాటింగ్ భారం మోస్తుంటే... వీరు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరకుండా ప్రత్యర్థిని కట్టడి చేసే బాధ్యత ఆవేష్ ఖాన్, మయాంఖ్, సుందర్ తీసుకుంటున్నారు. దీంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తూ వచ్చింది. ఈ మ్యాచ్ లో కరీబియన్లు గెలిస్తే తొలిసారి వరల్డ్ కప్ వారి సొంతమవుతుంది. అదే టీమిండియా గెలిస్తే...నాలుగోసారి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా నిలుస్తుంది.