: రాంగోపాల్ వర్మని పిచ్చాసుపత్రిలో చేర్చుకోండి: విశాఖ కాంగ్రెస్ నేతలు


ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవాలని విశాఖపట్టణంలోని కాంగ్రెస్ నేతలు మెంటల్ హాస్పిటల్ సూపరిండెంట్ కు వినతి పత్రం ఇచ్చారు. తాను రూపొందిస్తున్న 'వంగవీటి' సినిమాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉంటుందని వర్మ వెల్లడించడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న వ్యక్తుల్లో రాంగోపాల్ వర్మ ప్రథమ వరుసలో ఉంటాడు. తనకు ఏది నచ్చితే అది, ఎలా పడితే అలా మాట్లాడేసే వర్మ, 'వంగవీటి' సినిమా తీస్తున్నానని చెప్పాడు. అంతటితో ఆగకుండా తన సినిమాలో కులాల ప్రస్తావన వచ్చేలా ఓ పాటను కూడా విడుదల చేశాడు. దీంతో విజయవాడలో కులాల కుమ్ములాటలు మొదలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, వర్మ మాత్రం దానిని ఒప్పుకోవడం లేదు. ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఇప్పుడు సినిమాగా తీస్తే గొడవలు ఎందుకు మొదలవుతాయో తనకు అర్థం కావడం లేదని వర్మ తెలిపాడు. అయినా తాను సినిమా ఎవరో చూడాలని తీయడం లేదని, తనకు నచ్చింది చెప్పేందుకు సినిమా చేస్తున్నానని, నచ్చితే చూడాలని, లేకపోతే మానేయాలని వర్మ సూటిగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మకు మతి చలించిందని పేర్కొన్న విశాఖ కాంగ్రెస్ నేతలు, వైజాగ్ లోని పిచ్చాసుపత్రి సూపరిండెంట్ కి వినతి పత్రం ఇచ్చారు. వర్మకు పిచ్చిపట్టి నోటికొచ్చినట్టల్లా వాగుతున్నాడని, మీ ఆసుపత్రిలో చేర్చుకుని అతనికి సరైన చికిత్స అందజేయాలని వారు అందులో కోరారు.

  • Loading...

More Telugu News