: ధోనీ ఇలాకాలో దుమ్మురేపిన టీమిండియా...లంకతో సిరీస్ సమం
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతూళ్లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది. కుర్రాళ్లతో కూడిన శ్రీలంక జట్టుపై తొలుత బ్యాటింగ్ తో విరుచుకుపడిన భారత జట్టు, ఆ తర్వాత పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరచిన జట్టు పూణే ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ ను సమం చేసింది. ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మూడు టీ20ల సిరీస్ లో నిన్న రాంచీలో జరిగిన రెండో మ్యాచ్ లో ధోనీ సేన సత్తా చాటింది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆతిథ్య దేశ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. భారత జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్ రోహిత్ శర్మ (47) తనదైన స్టయిల్లో రాణిస్తే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (51) వచ్చీ రావడంతోనే బ్యాట్ ను ఝుళిపించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా తమ వంతు పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత 197 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి బంతితోనే రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. లంక స్టార్ బ్యాట్స్ మన్ తిలకరత్నే దిల్షాన్(0)ను ధోనీ స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ లో రెండో వికెట్, నాలుగో ఓవర్ లో మూడో వికెట్ ను చేజార్చుకున్న లంక కష్టాల్లో పడింది. ఇదే అదనుగా టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో రాణించి వరుసగా వికెట్లు తీశారు. వెరసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంక 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో లంకపై టీమిండియా 69 పరుగులతో విజయం సాధించినట్లైంది. తొలి టీ20లో పరాజయం పాలైన టీమిండియా, ఈ విజయంతో సిరీస్ ను సమం చేసింది. ఇక ఈ నెల 14న విశాఖలో జరగనున్న మూడో టీ20లో విజయం సాధించే జట్టునే సిరీస్ వరించనుంది.