: సమం చేస్తారా? చతికిలపడతారా?
రెండో టీట్వంటీ మ్యాచ్ కు టీమిండియా, శ్రీలంక జట్లు సిద్ధమయ్యాయి. పూణే వేదికగా జరిగిన టీట్వంటీలో హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన టీమిండియా జట్టు లంక యువబౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. గతంలో ఆసీస్ తో జరిగిన టీట్వంటీల్లో టీమిండియా పూర్తిస్థాయి జట్టును పరీక్షించే అవకాశం రాలేదు. పూణే టీట్వంటీలో బ్యాటింగ్ కు అవకాశం వచ్చినా, అశ్విన్ మినహా ఎవరూ రాణించలేదు. ఒకదశలో టీమిండియాలో కీలకంగా మారిన యువరాజ్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ పై మరోసారి చర్చ జరుగుతోంది. అయితే కేవలం ఒక్క మ్యాచ్ ఫలితంతో టీమిండియాపై విమర్శలు సమంజసమా? అని విశ్లేషకులు భావిస్తుండగా, ఈ అలసత్వమే టీట్వంటీ వరల్డ్ కప్ కు శాపంగా మారే ప్రమాదం ఉందని మరి కొందరు పేర్కొంటున్నారు. ఈ దశలో గత మ్యాచ్ లో పొరపాటు కారణంగా టీమిండియా ఓటమిపాలైందని నిరూపించాలంటే ఈ మ్యాచ్ లో ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. దీంతో సిరీస్ సమంతో పాటు టీమిండియా ఇప్పటికీ హాట్ ఫేవరేటే అని ప్రపంచానికి చెప్పే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సరైన ప్రణాళికతో ఆడితే కనుక టీమిండియాను ఇంటికి పంపడం పెద్ద కష్టం కాదనే సంకేతాలు ఇతర జట్లలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. తొలి టీట్వంటీలో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న లంకేయులను ఓడించాలంటే టీమిండియా శ్రమించాల్సిందే.