: సిగ్నల్ జంప్ చేస్తే లైసెన్స్ రద్దే!... ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసిన తెలంగాణ
హైదరాబాదు నగర రోడ్లపై ఇక సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లారో... మీ లైసెన్స్ రద్దైపోవడం ఖాయమే. ట్రాఫిక్ నియంత్రణలపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇకపై హైవేలపై గంటకు 80 కి.మీ, జిల్లాల రోడ్లపై 65 కి.మీ, టీఆర్ రోడ్లపై 50 కి.మీల వేగ పరిమితిని నిర్దేశించింది. ఈ వేగాన్ని మించి ప్రయాణిస్తే కఠిన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాఫిక్ కూడళ్లలో ఇకపై సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లే వాహనాల డ్రైవర్ల లైసెన్స్ లను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తరహా నేరాలకు మరోసారి పాల్పడితే, 3 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ప్రకటనలు జారీ చేయాలని కలెక్టర్లు, రవాణా శాఖాధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓవర్ లోడుతో వెళ్లినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.