: ప్రజలకు ఇబ్బందే... దాచుకునే చిన్న మొత్తాలపై మరింత తక్కువ వడ్డీ!
ఏప్రిల్ 1 నుంచి ప్రజలు దాచుకునే చిన్న మొత్తాలు, ఫిక్సెడ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలు సహా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీని తగ్గిస్తున్నట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు, బాలికల పేరిట ఉన్న ఖాతాలపై మాత్రం వడ్డీ తగ్గింపు ఉండదని తెలిపారు. ఈ మేరకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదలవుతుందని, ప్రస్తుతం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద ఉందని వివరించారు. కాగా, గత ఏడాది వ్యవధిలో పలు మార్లు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు, సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లపైనా వడ్డీలను తగ్గిస్తూ బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల విషయంలో మాత్రం అనుకున్నంత ప్రయోజనాలు ప్రజలకు దగ్గర కాలేదు. జనవరి 2015 నుంచి ఇప్పటివరకూ 1.25 శాతం మేరకు రెపో రేటు తగ్గగా, రుణాలు తీసుకున్న వారికి గరిష్ఠంగా 0.75 శాతమే ప్రయోజనం దక్కింది. ఇదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ ఒక శాతానికి పైగా తగ్గింది. ఇక మరోసారి వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్రం నిర్ణయించనుండటంతో పొదుపు ఖాతాలపై ప్రజలు మరింత తక్కువ ఆదాయాన్ని పొందనున్నారు.