: హైకోర్టు గడప తొక్కిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదన


టాలీవుడ్ ప్రముఖ నటి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రవేశించకుండా తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను రద్దు చేయాలని, తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులివ్వాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఈ మేరకు నిన్న ఆమె తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై జరిగిన వాగ్వాదం సందర్భంగా రోజా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని, స్పీకర్ స్థానాన్నే టార్గెట్ చేసి సభా నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమోదిస్తూ, రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. దీనిపై ఘాటుగా స్పందించిన రోజా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ బిజినెస్ రూల్స్ కు విరుద్ధమని ఆమె వాదించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను సైతం తనకివ్వలేదని వాపోయిన రోజా, స్పీకర్ తన హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ ఒక సెషన్ కు మాత్రమే పరిమితం చేయాల్సి ఉన్నా, స్పీకర్ దానిని ఉల్లంఘించి ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు.

  • Loading...

More Telugu News