: వసంత పంచమి, శుక్రవారం నమాజ్ మధ్య మధ్యప్రదేశ్ పోలీసులకు టెన్షన్ టెన్షన్!


మధ్యప్రదేశ్ లోని ధర్ పట్టణంలో ఉన్న వివాదాస్పద భోజ్ శాలలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే ప్రాంతంలో సరస్వతీదేవి గుడి, మసీదు ఉండటం, గతంలో ఇక్కడ ఎన్నోమార్లు మత ఘర్షణలు తలెత్తడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. శుక్రవారం నాడే సరస్వతీ దేవిని పూజించేందుకు అత్యంత శుభప్రదమైన వసంత పంచమి పర్వదినం రావడం, హిందూ, ముస్లిం మత పెద్దల మధ్య పూజా సమయాల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో మొత్తం 6 వేల మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలు, బీఎస్ఎఫ్ దళాలను ధర్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మోహరించింది. ఇక్కడి కమల్-అల్-దిన్ అనే ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఒక్క శుక్రవారం నమాజుకు మాత్రం ముస్లింలకు అనుమతి ఉంది. ఇదే స్థలంలో ఓ సరస్వతీ దేవి ఆలయం కూడా ఉండటంతో ప్రతి మంగళవారం పూజలు నిర్వహించుకునేందుకు, వసంత పంచమి నాడు ప్రత్యేక పూజలకు అనుమతి ఉంది. ఈ సంవత్సరం రెండు పర్వదినాలూ ఒకే రోజు రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్ర నెలకొంది. ఇప్పటికే సరస్వతీ దేవికి పూజలు చేసేందుకు వేలాది మంది హిందువులు గుడికి చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం నమాజు (జుమాహ్)ను చేసుకునేందుకు సైతం ముస్లింలు పెద్దఎత్తున రావాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ జుమాహ్ సమయం కాగా, వందలాది మంది చిన్నారులకు అదే సమయంలో అక్షరాభ్యాసం చేయించుకునేందుకు సరస్వతీ దేవి సన్నిధికి హిందూ ప్రజలు వస్తున్నారు. ఆ రెండు గంటలూ గుడిని వీడేందుకు హిందూ పెద్దలు నిరాకరించారు. దీంతో ఈ రెండు గంటల సమయం ఎలా గడుస్తుందోనన్న టెన్షన్ పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది.

  • Loading...

More Telugu News