: ఇక ఇంట్లో కూర్చొని కూడా పీఎఫ్ విత్ డ్రా!
పదవీ విరమణ నిధిని ఇకపై ఆన్ లైన్ లోనే విత్ డ్రా చేసుకునే సదుపాయం దగ్గర కానుంది. ఖాతాదారులంతా మరింత సులువుగా తమ డబ్బులను తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా కొత్త సౌకర్యాలను అందించాలని నిర్ణయించిన మీదట, ఆగస్టు నుంచి పీఎఫ్ విత్ డ్రా క్లయిములను ఆన్ లైన్లో స్వీకరించనున్నట్టు ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ప్రకటించింది. "మరో నాలుగు నెలల్లో ఆన్ లైన్ సౌకర్యం మొదలవుతుంది. వీటిని ప్రాసెస్ చేసేందుకు ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాం. త్వరలోనే గుర్ గాం, ఢిల్లీ, సికింద్రాబాద్ లలోని పీఎఫ్ సెంట్రల్ డేటా సెంటర్లలో సర్వర్ల ఏర్పాటు పూర్తవుతుంది. ఈ మూడింటితో దేశవ్యాప్తంగా ఉన్న 123 ఈపీఎఫ్ఓ కార్యాలయాలను అనుసంధానం చేస్తాం" అని వివరించారు. ఆపై జూన్ లో సర్వర్లను పరీక్షిస్తామని, కొన్ని రోజులు పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలవుతుందని తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న గంటల వ్యవధిలోనే డబ్బు ఖాతాదారుల బ్యాంక్ ఎకౌంట్లకు చేరిపోతుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే, సమీపంలోని కార్యాలయానికి వెళ్లి స్వయంగా పూర్తి చేసిన దరఖాస్తును అందించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని అందుకుని మరింత పారదర్శకంగా, వేగంగా ఖాతాదారులకు సేవలందించాలని భావించిన ఈపీఎఫ్ఓ, ఆన్ లైన్ నిర్ణయాన్ని గత సంవత్సరమే ప్రకటించింది. కాగా, ఆన్ లైన్ క్లయిములు చేయాలని కోరేవారు తొలుత, తమ బ్యాంకు ఖాతాలను, ఆధార్, పాన్ కార్డు సంఖ్యలు తదితర కేవైసీ వివరాలను తొలుత పీఎఫ్ ఆఫీసులకు అందించాల్సి వుంటుంది.