: పఠాన్ కోట్ దాడిలో ‘ఉగ్ర’ పన్నాగం... ‘ప్రొసీజర్’లో లేని బాంబుతో ఎన్ఎస్జీ కమాండో ప్రాణాన్ని బలిగొన్న వైనం
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిపిన దాడిలో ఉగ్రవాదులు పన్నిన సరికొత్త పన్నాగాలు వెలుగుచూశాయి. జైషే మొహ్మద్ రూపొందించిన పథకం ప్రకారం ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు అక్కడ భద్రతా విధుల్లో ఉన్న గరుడ కమెండోలపై కాల్పులు జరిపారు. వేగంగా స్పందించిన కమెండోలు కూడా ఉగ్రవాదులపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఆరుగురు గరుడ కమెండోలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులను కూడా గరుడ కమెండోలు మట్టుబెట్టారు. అయితే ఈ దాడిలో చనిపోయిన భద్రతా బలగాల సంఖ్య ఏడుకు చేరింది. ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కి చెందిన లెప్ట్ నెంట్ కల్నల్ ఈకే నిరంజన్ చనిపోయారు. నిరంజన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు బలి కాలేదు. వారు పన్నిన సరికొత్త పన్నాగానికి ఆయన బలయ్యారు. అదెలాగంటే... సాధారణంగా బాంబులను నిర్వీర్యం చేసే విషయంలో ఎన్ఎస్జీ ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)’ని పాటిస్తుంది. ఉగ్రవాదులు, మావోయిస్టులు రూపొందించే ఇంప్రొవైజ్ట్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీ)లను నిర్వీర్యం చేసే మెళకువలు ఎస్ఓపీలో ఉంటాయి. వాటి ఆధారంగానే బాంబు స్క్వాడ్ బృందాలకు శిక్షణ ఇస్తారు. ఇక నిరంజన్ బాంబు నిర్వీర్యంలో అప్పటికే అపార అనుభవాన్ని సంపాదించారు. బీహార్ రాజధాని పాట్నా, ఆ రాష్ట్రంలోని బోద్ గయ, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్... తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు పెట్టిన బాంబులను నిరంజనే నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో పఠాన్ కోట్ దాడిలోనూ రంగంలోకి దిగిన నిరంజన్... అప్పటికే హతమైన నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలిస్తూ, ఆ డెడ్ బాడీలకు ఉన్న బాంబులను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన ఎస్ఓపీ విధానాలను ఆశ్రయించారు. ఇక్కడే ఉగ్రవాదులు సరికొత్త పన్నాగం పన్నారు. సదరు బాంబులను వారు ఎస్ఓపీకి పట్టుబడని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ విషయం తెలియని నిరంజన్ బాంబులను నిర్వీర్యం చేయబోగా, అవి పేలిపోయాయి. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. బాంబుల తయారీలో సరికొత్త టెక్నాలజీని వినియోగించిన ఉగ్రవాదులు బాంబుల నీర్వీర్యంలో అపార అనుభవమున్న నిరంజన్ ను పొట్టనబెట్టుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఓ సారి మననం చేసుకున్న ఎన్ఎస్జీ... ఉగ్రవాదుల పన్నాగాలకు దీటుగా ఎస్ఓపీని రూపొందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.