: బాలయ్య ‘లేపాక్షి’ మంత్రం ఫలించింది!... సోందేపల్లి-యలహంక రోడ్డుకు నేషనల్ హైవే హోదా
నటనలో తనదైన శైలిలో సత్తా చాటుతూ యువ హీరోలకు దీటుగా టాలీవుడ్ లో ‘యువరత్న’గా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ రాజకీయ నేతగానూ దూసుకెళుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఓ వైపు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూనే తరచూ హిందూపురంలో పర్యటిస్తూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని కాకలు తీరిన రాజకీయ నేతలను సైతం వెనక్కు నెట్టిన బాలయ్య పనితీరులో అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా ఈ నెల 27, 28 తేదీల్లో తన సొంత నియోజకవర్గంలో లేపాక్షి ఉత్సవాల నిర్వహణకు ఆయన సన్నద్ధమయ్యారు. ఏపీ సర్కారు ఆధ్వర్యంలోనే జరగనున్న ఈ ఉత్సవాలకు బాలయ్య అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మొన్నటిదాకా విశాఖ, విజయవాడ, హైదరాబాదుల్లో లేపాక్షి ఉత్సవాల ఇన్విటేషన్లు చేతబట్టి ఏపీ, తెలంగాణలకు చెందిన నేతలకు ఆహ్వానం పలికిన ఆయన తాజాగా ఢిల్లీకి చేరారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా పలు కీలక మంత్రులకు ఆయన లేపాక్షి ఆహ్వానాలను అందించారు. తాజాగా నిన్న ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఆహ్వానం అందించారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో కలిసి గడ్కరీ వద్దకెళ్లిన బాలయ్య... ఆహ్వాన పత్రికను అందించడంతోనే సరిపెట్టలేదు. తన నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి నుంచి కర్ణాటకలోని యలహంకకు దారి తీసే రోడ్డుకు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జాతీయ హోదా ప్రకటనను ప్రస్తావించారు. ఉత్సవాల ఆహ్వానం అందించిన సందర్భంగా నియోజకవర్గ సమస్యను ప్రస్తావించిన బాలయ్య విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సోమందేపల్లి-యలహంక రోడ్డుకు జాతీయ హోదా ప్రకటించేందుకు గడ్కరీ అంగీకరించారు. త్వరలోనే ఈ మేరకు ప్రకటనను వెలువరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.