: టీ టీడీపీకి మిగిలేది ఇక ముగ్గురు ఎమ్మెల్యేలేనా?... మరో ఇద్దరు కారెక్కేందుకు రెడీగా ఉన్నారట!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన నిజరూపం దాల్చి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన వేళ జరిగిన తొలి ఎన్నికల్లోనూ టీడీపీ తన సత్తా చాటింది. ప్రతికూల వాతావరణంలోనూ ఏకంగా 15 సీట్లను కైవసం చేసుకుని కార్యకర్తల బలమున్న పార్టీగా టీడీపీ అవతరించింది. అంతేకాక గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నా ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే కాక మల్కాజిగిరీ ఎంపీ సీటులోనూ జయకేతనం ఎగురవేసింది. అయితే తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీ టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆకర్ష్’ పధకానికి టీడీపీ ఎమ్మెల్యేలు సరెండర్ అయిపోయారు. ఈ క్రమంలో నిన్నటిదాకా దఫదఫాలుగా జరిగిన చేరికల్లో మొత్తం 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇక టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సహా ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం టీ టీడీపీకి మిగిలారు. వీరిలోనూ మరో ఇద్దరు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే టీఆర్ఎస్ హైదరాబాదులోని నిజాం గ్రౌండ్స్ లో ఓ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభ నాటికి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమేనట. ఈ మేరకు నిన్న నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆ పార్టీ విశ్వనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తాము వద్దనుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో ఉంటారని ఆ వర్గాలు సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఇక కొత్తగా టీఆర్ఎస్ లో చేరనున్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధికి చెందిన ఎమ్మెల్యేలేనని సదరు వర్గాలు వెల్లడించడంతో ప్రస్తుతం దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.