: భారత్ లో ఆడేదీ లేనిదీ వారం రోజుల్లో నిర్ణయిస్తాం: పీసీబీ మీడియా డైరెక్టర్
భారత్ లో నిర్వహించనున్న టీట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ఆడేదీ లేనిదీ వారం రోజుల్లో తేలుతుందని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మీడియా డైరెక్టర్ అంజాద్ హుస్సేన్ తెలిపారు. టీట్వంటీ వరల్డ్ కప్ పై ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ లో ఆడేందుకు అనుమతి ఇస్తే టీట్వంటీల్లో ఆడుతుందని, లేదంటే లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆడేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. గతంలో భారత్ లో పాకిస్థాన్ జట్టు పర్యటిస్తే దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత్ లో పర్యటించే ఏ జట్టుకైనా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగల సామర్థ్యం బీసీసీఐకి ఉందని అన్నారు. ఒకవేళ ఏ జట్టుకైనా భారత్ లో ఆడడం ఇష్టం లేని పక్షంలో ఆ విషయం సూటిగా ఐసీసీకి చెప్పవచ్చని ఆయన స్పష్టం చేశారు.