: నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటానంటే మధ్యలో మీ బాధ ఏమిటి?: రాంగోపాల్ వర్మ
ఎవరైనా వచ్చి మహాత్మాగాంధీ మీదో లేక మదర్ థెరెస్సా మీదో సినిమా తీస్తామంటే... తీయవద్దు అని చెప్పనని రాంగోపాల్ వర్మ అన్నారు. అలాగే 'నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటానంటే మధ్యలో మీకు వస్తున్న బాధ ఏంటో అర్థం కావడం లేద'ని రాంగోపాల్ వర్మ వాపోయారు. తనకు కూడా సమాజం అంటే బాధ్యత ఉందని, అసలు బాధ్యత ఉందని చెప్పుకునే వారికంటే ఎక్కువ బాధ్యత తనకే ఉందని వర్మ స్పష్టం చేశారు. అయినా తనకు అర్థం కాని విషయం ఏంటంటే...తన సినిమాలో తాను ఏదో చెబితే కమ్మలు, కాపులు ఎందుకు కొట్టుకుంటారని ప్రశ్నించారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను...అప్పట్లో ఇలా జరిగింది అని చెబితే విద్వేషాలు ఎందుకు రేగుతాయో తనకు అర్థం కావడం లేదని వర్మ అన్నారు. దీనిపై ఏదయినా అభ్యంతరం చెప్పే హక్కు దేవినేని, వంగవీటి కుటుంబాలకు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను వారిని తప్పకుండా కలుస్తానని, మరిన్ని విషయాలు తెలుసుకుంటానని వర్మ తెలిపారు. తన సినిమాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనో లేక వారికి క్లాసులు పీకాలనో ఆలోచన తనకు లేదని, సినిమా తనకు అన్నం పెడుతుంది కనుక తీస్తున్నానని ఆయన అన్నారు.