: విద్యుత్ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేసిన కోదండరాం!


ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం చేసుకుంటున్న ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈరోజు హైదరాబాద్ లో విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విచారణకు హాజరైన రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందంపై అనుమానాలున్నాయని చెప్పారు. ఒప్పందంపై చర్చ జరగాలని, అభ్యంతరాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ప్రజలపై భారం పడుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోదండరాం సూచించారు. అంతకుముందు విద్యుత్ రంగ నిపుణుడు రఘు మాట్లాడుతూ, ఈ విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి రూ.900 కోట్ల నష్టం వాటిల్లనున్నట్టు చెప్పారు. విద్యుత్ యూనిట్ కు ఛత్తీస్ గఢ్ రూ.5.45 పైసలు వసూలు చేస్తే, ఏపీ రూ.4.40 పైసలకే ఇస్తామని చెప్పిందని తెలిపారు.

  • Loading...

More Telugu News