: రెండో విడత 'సరి-బేసి' విధానం... తేదీలివే!
దేశ రాజధానిలో రెండవ విడత 'సరి-బేసి' విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియాతో సమావేశమైన ఆయన కొత్త తేదీలను ప్రకటించారు. తొలి విడతలో మాదిరిగానే మలి విడతలోనూ మహిళలు, వీఐపీలు, ద్విచక్ర వాహనదారులకు మినహాయింపును ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలి విడతలో ఎదురైన సమస్యలను అధిగమించేందుకు మరింతగా కృషి చేస్తామని తెలిపారు. బస్సుల సంఖ్యను మరింతగా పెంచుతామని, మెట్రో రైళ్ల ట్రిప్పులను, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కేజ్రీవాల్ వివరించారు. వాస్తవానికి మార్చిలోనే రెండో విడత అమలు చేయాలని భావించినప్పటికీ, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, సెలవులు ఇచ్చిన తరువాతే 'సరి-బేసి' నిబంధన విధించాలని భావించినట్టు తెలిపారు.