: నిన్నటి వరకూ అబలలు... నేడు ముష్కరులపై తిరగబడుతున్న అపర కాళికలు!
నిన్న మొన్నటి వరకూ వారంతా ఏ దిక్కూ లేకుండా, అన్ని రకాల హింసనూ అనుభవిస్తూ సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఏడుస్తూ కూర్చున్నవారే. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు లైంగిక బానిసలుగా చిక్కి వారి కబంధ హస్తాల్లో నిత్యమూ నలిగిపోయిన వారే. ఇప్పుడు వారంతా ఏకమయ్యారు. తమను శారీరక హింసలకు గురిచేసిన వారిపై పగ తీర్చుకునేందుకు నడుం బిగించారు. ఆయుధాలు చేతబట్టారు. 'సన్ లేడీస్' పేరిట ఓ కొత్త బెటాలియన్ ను ప్రారంభించి మోసుల్ నగరంలోని ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించారు. వారి లక్ష్యం ఒక్కటే. ముష్కరుల చేతుల్లో ఇప్పటికీ నలుగుతున్న వారిని బయటకు తీసుకురావడం. ఉగ్రవాదులకు చిక్కి హింసలు అనుభవించి ఎలాగోలా పారిపోయి వచ్చిన వారంతా, ఒక చోట చేరారు. మొత్తం 500 మందికి పైగా యాజిడి వర్గానికి చెందిన మహిళలు ఈ 'సన్ లేడీస్'ను ప్రారంభించారు. ఒకే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. వీరికి అండగా కుర్దూ సైనిక దళాలు కదులుతున్నాయి. సైనిక దుస్తులు, అత్యాధునిక ఆయుధాలు ధరించిన యాజిడి మహిళల చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరిచేతా 'ఆల్ ది బెస్ట్' చెప్పించుకుంటున్నాయి. కాగా, మోసుల్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కనీసం 2000 మందిని లైంగిక బానిసలుగా వాడుకుంటున్నారని తెలుస్తోంది. వీరిపై అత్యాచారాలు నిత్యకృత్యం. భయంకర పరిస్థితుల్లో దుర్భర జీవితం సాగిస్తున్న వీరికి స్వేచ్ఛావాయులను అందించే దిశగా సాగుతున్న యుద్ధం విజయవంతం కావాలని ఆశిద్దాం.