: పాతాళానికి ఉల్లి... క్వింటాలు రూ. 700
మొన్నటి వరకూ కన్నీరు పెట్టించిన ఉల్లి ధర ఇప్పుడు పాతాళానికి జారిపోయింది. దేశవాళీ మార్కెట్లో హోల్ సేల్ ఉల్లి ధర నేడు క్వింటాలుకు రూ. 700కు తగ్గింది. ఉల్లిపాయలకు ప్రధాన కేంద్రంగా ఉన్న నాసిక్ మార్కెట్లోకి లారీల్లో ఉల్లిపాయలను తెచ్చిన వారు తమకు రవాణా ఖర్చులు కూడా మిగలడం లేదని వాపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ఉల్లి దిగుబడి పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, తక్కువ నాణ్యత ఉన్న ఉల్లి ధర క్వింటాలుకు రూ. 400 వరకూ పడిపోయింది. ఏప్రిల్ 11, 2014 తరువాత ధరలు ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. 100 కిలోల ఉల్లిని పండించాలంటే రూ. 900 ఖర్చు చేయాల్సి వస్తోందని, ధర ఈ స్థాయికి దిగజారితే తమ దిక్కేంటని, ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.