: రైలెక్కాలంటే జేబు గుల్లే... ఏకంగా 10 శాతం పెరగనున్న చార్జీలు!


ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ, లాభాలను నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్న భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులపై భారం మోపనుంది. ప్రయాణికుల టికెట్ ధరలను కనీసం 10 శాతం పెంచాలన్నది రైల్వే శాఖ ఉద్దేశంగా తెలుస్తుండగా, దీని వల్ల అదనంగా రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని అధికారులు లెక్కలు కడుతున్నారు. వేతన సంఘ సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాల పెరుగుదలతో పడే భారాన్ని తప్పించుకోవాలంటే, ఇంతకన్నా మరో మార్గం లేదని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రద్దీ వేళ రైల్వే చార్జీలను మరింతగా పెంచుకునే వెసులుబాటును కల్పించేందుకూ ఆయన నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వేసవి సీజన్ లోనే చార్జీల పెంపు, రద్దీ వేళల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. కాగా, ఇటీవలి పే కమిషన్ సిఫార్సులతో రైల్వే శాఖకు సాలీనా రూ. 32 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. దీనికి అదనంగా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 12 వేల కోట్ల కోతను విధిస్తున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక సరకు రవాణా, పాసింజర్ చార్జీల నుంచి వచ్చే ఆదాయ లక్ష్యాన్ని రైల్వే శాఖ ఈ సంవత్సరం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నిర్వహణా నిష్పత్తి కొనసాగాలంటే భారాన్ని ప్రజలపై వేయక తప్పదన్నది సురేష్ ప్రభు అభిప్రాయం. 25వ తేదీన పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ లో వీటిపై ప్రతిపాదనలు రానున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News