: వరంగల్ టూ గ్రేటర్ మేయర్... వయా ఉస్మానియా!
బొంతు రామ్మోహన్... కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ మహానగరానికి ప్రథమ పౌరుడి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. ఈ స్థాయికి రావడానికి ఆయన చాలానే కష్టపడ్డారు. వరంగల్ జిల్లా కురవి మండల పరిధిలోని నేరడలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ పదవిని చేరుకున్నారు. బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతుల ఏకైక కుమారుడిగా, ఐదో తరగతి వరకు ఆమనగల్ లో, ఆపై ఎనిమిది వరకూ నేరడలో చదివిన రామ్మోహన్, మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్ లో 10వ తరగతి, జూనియర్ కాలేజీలో ఇంటర్, వరంగల్ లోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన తరువాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రభావితుడయ్యారు. తొలుత బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తగా ఉన్న బొంతు, 2002లో టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆపై వివిధ ఉద్యమాలకు విద్యార్థులను సమీకరిస్తూ, కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా ఎదిగారు. తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి గెలిచిన బొంతును సీఎం కేసీఆర్ స్వయంగా మేయర్ పదవికి ఎంపిక చేశారు. అమీర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహమాడిన రామ్మోహన్ కు ఇద్దరు కుమార్తెలు.