: రామోజీరావుపై ఉండవల్లి సంచలన ఆరోపణలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నో ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న ఆయనకు పద్మవిభూషణ్ బిరుదు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తనపై ఉన్న కేసుల నుంచి రామోజీరావు బయటపడలేదని గుర్తు చేశారు. ఎందరో ప్రజల నుంచి ఆయన అక్రమంగా డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని చెప్పిన ఉండవల్లి, ఈ విషయాలను ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. రామోజీరావుకు అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని తప్పుబట్టారు. ఆయనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. గతంలో తాను రామోజీరావు బాగోతాలను బయటపెట్టినప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా విచారణకు ఆదేశించారని, ఇప్పుడు ఆ విచారణ పూర్తి కాకుండానే అవార్డు ప్రకటించేశారని అంటూ, విచారణ జరిపించాలని కోరుతూ జైట్లీ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.