: ఈసారి శీతాకాలంలో వచ్చే వర్షాలు ఎక్కువే!: వాతావరణ శాఖ అధికారులు
ఈసారి శీతాకాలంలో వచ్చే వర్షాలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉండవచ్చని, ఇవి ఏప్రిల్ వరకు ఉండవచ్చని వాతావరణ శాఖకు చెందిన ప్రకాశ్ సింగ్ రాథోర్ చెప్పారు. ఎన్ లినో ప్రభావం కారణంగానే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముందని అన్నారు. బంగాళాఖాతం మీదుగా వచ్చే ఆగ్నేయ పవనాలు తేమను తీసుకురావడం వల్ల గాలిలో ఉష్ణోగ్రత పెరిగి, ఇటువంటి వర్షాలు కురుస్తాయని అన్నారు. మార్చి- ఏప్రిల్ లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉండవచ్చన్న వార్త వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం. 2009, 2015 సంవత్సరాలలో ఇదే విధంగా వర్షాలు కురిశాయి. కాగా, ఈ సీజన్ లో మార్చి వరకు కురిసే చిరుజల్లులు పంటలపై పెద్దగా ప్రభావం చూపవని గోధుమ, బార్లీ పరిశోధనా కేంద్రం మాజీ డైరెక్టర్ సుశీల్ శర్మ అన్నారు. అయితే, భారీ వర్షాలు పడితే మాత్రం సమస్యలు తప్పవని చెప్పారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారన్నారు.