: జీహెచ్ఎంసీలో ఏం చేస్తామో అజెండా రూపంలో ప్రకటిస్తాం: కేటీఆర్
జీహెచ్ఎంసీలో ఏం చేస్తామో అజెండా రూపంలో ప్రకటిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జీహెచ్ఎంసీలో ఏం చేయగలమో అవే చెబుతామని అన్నారు. జీహెచ్ఎంసీని మెరుగుపరిచేందుకు దేశంలో సమర్థవంతమైన మున్సిపాలిటీలను పరిశీలిస్తామని చెప్పారు. గ్రేటర్ లో భవన నిర్మాణాలకు సంబంధించి తొమ్మిది నెలల్లో ఆన్ లైన్ అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఏ మ్యానిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లామో దానిని అందరు అధికారులకు అందజేశామని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించి నిర్ధిష్టమైన కాలపరిమితితో కూడిన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన చెప్పారు. ఇక, తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు ప్రయోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. గ్రేటర్ లో అవినీతి లేకుండా చేయడానికి పాటుపడతామని ఆయన చెప్పారు. కొత్త ఆదాయమార్గాలు పెంచుకుంటూ గ్రేటర్ పాలన సాగిస్తామని ఆయన తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు వంద శాతం పన్నులు కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టాల అమలులో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. సౌకర్యాలు కూడా అలాగే కల్పిస్తామని ఆయన తెలిపారు.