: అయ్యా! చంద్రబాబుగారూ...బీజేపీ నేతలను నమ్మకండి!: శివాజీ
బీజేపీ నేతలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'అయ్యా! చంద్రబాబుగారూ బీజేపీ నేతలు ఊసరవెల్లుల లాంటివారు. వారిని నమ్మకండి' అన్నారు. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారం చేపట్టిన తరువాత మరొకలా వ్యవహరించడం బీజేపీ నేతలకే చెల్లిందని ఆయన విమర్శించారు. అందుకు ఉదాహరణగా ఇంటర్నేషనల్ నేవల్ ఫ్లీట్ ను పేర్కొన్నారు. నేవల్ ఫ్లీట్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్లీట్ అద్భుతంగా నిర్వహించారని నేవీ అధికారులను పొగిడారని, ఇన్ని ఏర్పాట్లు చేసిన చంద్రబాబును పట్టించుకోలేదని అన్నారు. అదే వేదిక పంచుకున్న చంద్రబాబును 'బాగా చేశావు' అని అభినందిస్తే నష్టమేంటని ఆయన అడిగారు. ఇదే బీజేపీ అసలు స్వభావాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లీట్ నిర్వహణ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని, ఎన్నో శాఖలను సమన్వయం చేశారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? అని అడిగారు. ఇలాంటి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏదో చేసేస్తారనే నమ్మకం పోతోందని ఆయన చెప్పారు. అందుకే వారిని నమ్మవద్దని చెబుతున్నానని ఆయన తెలిపారు.