: ముగ్గురు విద్యార్థులు, ట్రాఫిక్ కానిస్టేబుల్ సహా... 19 మంది ఎర్ర దొంగలు అరెస్టు
తిరుమల, తిరుచానూరు, ఎంఆర్ పల్లి ప్రాంతాల్లో ఇవాళ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 19 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేశారు. వారిలో తిరుపతికి చెందిన ముగ్గురు విద్యార్థులు, వేలూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. గతంలోనూ ఈ విషయంలో కొందరు విద్యార్థులు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారంతా పోలీసు యూనిఫాంలో తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు కానిస్టేబుల్ సహకరిస్తున్నాడని వెల్లడించారు. పది ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి తిరుపతి మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరుస్తామని వివరించారు. గడచిన రెండు నెలల్లో 42 మందిని అరెస్టు చేశామన్నారు.