: టీడీపీతో నాకెలాంటి సంబంధాలు లేవు: ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ టికెట్ పై మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లతో మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు గర్జన’, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష, ఏపీ ప్రభుత్వం రాజీ మంత్రం నేపథ్యంలో బీసీలకు కాపులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. కాపులకు వేరుగా రిజర్వేషన్లు ఇచ్చుకుంటే ఫరవాలేదని, అయితే వారిని బీసీల్లో చేరిస్తే మాత్రం సహించేది లేదని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. మరోవైపు కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే, పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారంటూ ఆర్.కృష్ణయ్యను మీడియా ప్రశ్నించింది. ఇందుకు ఆయన ఘాటుగా స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన టీడీపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా బీసీనీ సీఎంను చేస్తానంటేనే ఆ పార్టీలో చేరానని ఆయన చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేగా కంటే బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తాను ఏ ఒక్క పార్టీ జెండాను మోసేందుకు సిద్ధంగా లేనని ఆయన ప్రకటించారు.