: అచ్చుగుద్దినట్టుండే అదే టైటానిక్... మరో ప్రయాణానికి తిరిగొస్తోంది!
టైటానిక్... మానవ ప్రపంచం మరచిపోలేని విషాదాన్ని మిగిల్చిన లగ్జరీ నౌక. దాదాపు 104 సంవత్సరాల క్రితం సౌతంప్టన్ నుంచి న్యూయార్క్ కు బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి దాదాపు 1500కు పైగా ప్రాణాలను తీసిన నౌక. ఇప్పుడు అచ్చుగుద్దినట్టుండే అదే తరహా నౌక తయారవుతోంది. దీనికి టైటానిక్-2 అని పేరు పెట్టారు. దీని ప్రయాణం 2018లో మొదలవుతుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్, 'బ్లూస్టార్ లైన్' పేరిట క్రూయిజ్ సేవలందిస్తున్న క్లైవ్ పామర్ దీన్ని తయారు చేస్తున్నారు. రంగు, రూపంలో టైటానిక్ లాగానే ఉండే దీనిలో, ప్రయాణించే వారందరికీ సరిపడా లైఫ్ బోట్లు ఉంటాయట. మొత్తం 270 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పుతో 40 వేల టన్నుల బరువుంటుందని 'బెల్ ఫెస్ట్ టెలిగ్రాఫ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తొలి టైటానిక్ లో మాదిరిగానే దీనిలో కూడా మూడు తరగతులు ఉంటాయని, 9 ఫ్లోర్లు, 2400 మందికి ఆతిథ్యమిచ్చేలా 840 క్యాబిన్ లు, 900 మంది క్రూ మెంబర్లు ప్రయాణిస్తారని సమాచారం. దీనిలో కూడా ఓ స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్ రూములను తీర్చిదిద్దుతున్నామని బ్లూస్టార్ లైన్ మార్కెటింగ్ డైరెక్టర్ జేమ్స్ మెక్ డొనాల్డ్ తెలిపారు. ఇది 21వ శతాబ్దపు నావని అభివర్ణించిన ఆయన, శాటిలైట్ కంట్రోల్, డిజిటల్ నావిగేషన్ వ్యవస్థ, రాడార్ సిస్టమ్ లు ఉంటాయని తెలిపారు.