: హనుమంతప్ప రెస్క్యూ వీడియో వైరల్... పాత వీడియోగా తేల్చేసిన సైన్యం


దేశ రక్షణలో భాగంగా సియాచిన్ లో మంచు తుపాను కింద చిక్కిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరు రోజుల తర్వాత మృత్యుంజయుడిగా బయటపడ్డారు. 25 అడుగుల మేర మంచు కింద కప్పబడిపోయినా, ఆయన బతికి బట్టకట్టడం అద్భుతమే. ప్రస్తుతం కోమాలో ఉన్న హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశం యావత్తు ప్రార్థిస్తోంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ కు వెళ్లి ఈ వీర సైనికుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించి అతనిని బతికించాలని ఆయన వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంచు గడ్డల్లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు బయటకు తీస్తున్నట్లున్న ఓ వీడియో నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. హనుమంతప్పను బయటకు తీస్తున్న సమయంలో తీసిన వీడియోనేనంటూ ఫేస్ బుక్, వాట్సాప్ లలో దానికి ట్యాగ్ లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేషనల్ మీడియాతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ మీడియా ఛానెళ్లలోనూ ఈ వీడియో ప్రసారమైంది. దీంతో సైనికాధికారులు దానిని పరిశీలించి కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన చేశారు. సదరు వీడియో భారత సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కే చెందినదేనని, అయితే లాన్స్ నాయక్ హనుమంతప్పను కాపాడుతున్న సందర్భంగా తీసినది కాదని, చాలా పాత వీడియో అని ఆ ప్రకటనలో సైన్యం ప్రకటించింది.

  • Loading...

More Telugu News