: చిరంజీవి, దాసరిని ఎందుకు నిర్బంధించామంటే..: చంద్రబాబు
రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శిస్తామంటూ రాజమండ్రికి వచ్చిన చిరంజీవి, రఘువీరారెడ్డి, దాసరి నారాయణరావులను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందో చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై వివరణ ఇచ్చారు. అసలు వారు కిర్లంపూడికి ఎందుకు వెళ్లాలని అనుకున్నారో తెలియదని, ముద్రగడను పరామర్శించడానికి కారణాలేంటని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారని గుర్తు చేశారు. అసలు కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కాపుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడని రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రిగా ఉండి కూడా రిజర్వేషన్లపై ముందడుగు వేయని దాసరి నారాయణరావులు ముద్రగడను కలిసిన తరువాత అవాంఛనీయ పరిస్థితి తలెత్తితే బాధ్యత ఎవరిదని అడిగారు. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అచ్చెన్నాయుడు తదితరులు ముద్రగడతో చర్చలు సాగిస్తున్నారని, అవి ఫలవంతమవుతాయన్న నమ్మకం ఉండబట్టే, వారిని ఆపామని తెలిపారు. ముద్రగడ దీక్ష విరమణ తరువాత వారిని విడిచిపెట్టామని గుర్తు చేశారు.